మొలకలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. వీటిలో ప్రోటీన్స్ పుష్కలంగా లభించి శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందిస్తాయి. హెల్తీ ఆహారాల వైపు మారాలనుకునేవారికి మొలకలు మంచి ప్రారంభ ఆహారం. దీని కోసం మనం రోజు గుప్పెడు పెసలు, గుప్పెడు బొబ్బర్లు, గుప్పెడు సెనగలు కలిపి నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత తినడం వలన శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సెనగలు తినడం వలన కొంతమందికి గొంతులో గురగురగా అనిపించడం, నాలుక కొట్టుకుపోవడం లేదా వాటి రుచి నచ్చకపోవడం వంటి సమస్యలతో ఎక్కువగా పెసలు మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు.
పెసలతో రుచిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతి రోజు కేవలం పెసలను తీసుకోవడం వలన శరీరానికి ఏదైనా సమస్య ఉంటుందా అంటే లేదని చెబుతున్నారు. పెసలు మాత్రమే తినడం వలన కూడా శరీరానికి కావలసిన ప్రొటీన్లు పుష్కలంగా లభించడంతో పాటు, శెనగలు, బొబ్బర్లు తినకపోవడం వలన మనం నష్టపోయే లాభాలను పెసలు అందిస్తాయి. ఇవి తినడం వలన గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కేవలం పెసలను తినడం వలన కొన్ని రోజులకు తినాలని ఆసక్తి కొరవడుతుంది. అందుకే పెసల మొలకలతో పాటు మరొక పదార్థాన్ని కలిపి తినడం వలన అద్భుతమైన రుచితో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
అదేంటి అనుకుంటున్నారా? అదే కొబ్బరి తురుము. కొబ్బరి శరీరానికి కావలసిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పెసలు మొలకలు కట్టించి తినేటప్పుడు దానితో పాటు కొద్దిగా కొబ్బరి తురుము కూడా చేర్చి తినడం వలన ఫైబర్ మరియు MCT లు సమృద్ధిగా లభిస్తాయి, ఇది మెరుగైన గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం మరియు జీర్ణక్రియతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా, ఇందులో అధిక కేలరీలు మరియు సంతృప్త కొవ్వు ఉన్నాయి, కాబట్టి మీరు దీన్ని మితంగా తినాలి. మొత్తంమీద, తియ్యని కొబ్బరి తురుము సమతుల్య ఆహారం(డైట్)లో భాగంగా తీసుకోవడం వలన గొప్పలాభాలను అదనంగా పొందవచ్చు.