హెయిర్ ఫాల్ తగ్గడానికి జుట్టు దృఢంగా, బలంగా పెరగడానికి మన ఆహారపు అలవాట్లు చాలా బాగా పనిచేస్తాయి. మన ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు చేర్చడం వలన శరీరంలో ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టు పెరగడానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. జుట్టు బాగా పెరగడానికి జుట్టులోని చర్మానికి రక్తప్రసరణ బాగా జరగడం అవసరము. రక్తప్రసరణ బాగా జరగాలంటే శరీరంలో రక్తం సరైన మోతాదులో ఉండాలి. అలాగే రక్తం మలినాలు లేకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కలిగి ఉండాలి. వీటన్నింటికి ముఖ్యంగా మన ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
పాలకూర, బచ్చలి కూర, గోంగూర వంటివి ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఐరన్, విటమిన్ ఇ వంటివి పుష్కలంగా లభిస్తాయి. మీ శరీరంలో రక్తహీనత తగ్గించి రక్త శాతాన్ని పెంచుతాయి. శరీరంలో రక్తం తగ్గడం వలన మొదట చర్మం, జుట్టుపై ఆ ప్రభావం పడుతుంది. జుట్టు రాలిపోవడం, చర్మం కాంతి విహీనం అవ్వడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. అందుకే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరల్ని నేరుగా తీసుకోలేని వారు కందిపప్పు, పెసరపప్పు వంటివాటితో కలిపి తీసుకోవాలి. పప్పులు కూడా శరీరానికి కావలసిన ప్రొటీన్లు పుష్కలంగా అందిస్తాయి. రోజూ తీసుకోవాల్సిన ఆహారంలో కూర శాతం ఎక్కువగా ఉండాలి. దాని కోసం కనీసం ఒక పప్పు, ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.
పప్పులతో పాటు సోయాబీన్, బఠానీలు, రాజ్మా వంటివి కూరలో వేసుకుని తీసుకోవాలి. ఇవి మనకి ప్రొటీన్లు, ఫైబర్ అందించడంలో సహాయపడతాయి. వీటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉడికించి కూరల్లో వేయడం ద్వారా త్వరగా జీర్ణమవుతుంది. సోయా సరిగ్గా జీర్ణం కాని వారు సోయా చంక్స్ లేదా ఫ్లేక్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే పుచ్చ పప్పులో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. కందిపప్పు కంటే పుచ్చ పప్పు లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుందని అధ్యయనాలు నిరూపించాయి.
వీటన్నింటిని ఆహారంలో తీసుకోవడంతో పాటు రోజూ తల స్నానం చేయడం వలన తలలో రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. వీలయినంతవరకు చల్లని నీటితో తలస్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. కనీసం పది నిమిషాల పాటు రన్నింగ్ వాటర్ కింద ఉండడం వలన, చేతితో తలలోని చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు కుదుళ్లకు కావాల్సిన బలం చేకూరుతుంది.