చుండ్రు సమస్య అధికంగా ఉండే వారిలో పెచ్చులు పెచ్చులుగా కట్టడం, పొడిలా రాలడం, దురద, నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివలన మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంది. చుండ్రు వలన జుట్టు రాలిపోవడం అతి పెద్ద సమస్య. దీనిని తగ్గించుకోవడానికి మనం కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దానికోసం మనకు కావలసిన పదార్థాలు వేపాకులు మరియు మందార ఆకులు. వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను అరికట్టడంలో చాలా బాగా సహాయపడుతాయి.
వేపాకులు చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపచేసి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. మందార ఆకులు జుట్టు పెరుగుదలకు జుట్టు సమస్యలు తగ్గడానికి సహాయపడుతాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి మరియు నీటిని ఎక్కువ వేయకుండా తలకు అప్లై చేసుకోవడానికి వీలుగా చేయాలి. దీనిలో ఒక కప్పు పెరుగును యాడ్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. పాయలు పాయలుగా విడదీసుకొని ఈ పేస్ట్ ను అప్లై చేసి 20 నిమిషాల తర్వాత మామూలు నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ ఈ చిట్కా పాటించడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
తర్వాత చిట్కా కోసం ఒక కప్పు మెంతులు తీసుకోవాలి. దానిని రెండు కప్పుల నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక కప్పు పెరుగు కలిపి తలకు అప్లై చేయాలి. మెంతులు, పెరుగు మిశ్రమం తలలో వేడిని తగ్గించి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. చుండ్రు నిరోధకతకు సహాయపడుతుంది. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయడం వలన చుండ్రు సమస్య నెమ్మదిగా తగ్గుతుంది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఈ చిట్కాలను పాటించడం వలన జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఇలా తరచూ ఈ రెండింటిలో ఏదో ఒకటి పాటిస్తూ చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే రోజూ తలస్నానం చేయడం చుండ్రు ఉన్నవారు చేయవలసిన ముఖ్యమైన నియమం. రోజూ తల స్నానం చేయడం వలన తలలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేయవచ్చు. దీనివలన తలలోని చర్మం శుభ్రంగా ఉంటుంది మరియు చుండ్రు తగ్గుతుంది. చుండ్రు ఉన్నవారు నూనెను అప్లై చేయకూడదు మరియు విడిగా పెట్టుకున్న దువ్వెన మాత్రమే ఉపయోగించాలి.