పుదీనా వట్టి ఆకు కూరే కదా అందులో పెద్ద గొప్పతనం ఏముంది అని అనుకొని తేలిగ్గా తీసి పక్కన పడేయకండి. పుదీనాతో ఎన్నో లాభాలు. మరెన్నో మంచి ఫలితాలు ఉంటాయి. పుదీనా
ఆకుల్లో పాస్పరస్, కాల్షియం, వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచే విటమిన్ బి, సీ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా మన వంటింటి పుదీనా లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
◆ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి గుప్పెడు పుదీనా ఆకులు వేసి మనం ఉండే రూమ్ లో ఓ పక్కగా పెడితే పుదీనా ఆకుల నుంచి వచ్చే సువాసన కి మనలో ఉన్న ఒత్తిడి దూరమవుతుంది.
◆ఒళ్ళు నొప్పులు ఉన్నవారిలో కండరాల నొప్పులు తగ్గించడానికి పుదీనా చాలా ఉపయోగపడుతుంది.
◆కడుపు ఉబ్బరం అజిర్తితో బాధపడుతూ ఉంటే రెండు గ్లాసుల నీళ్ళలో పుదీనా ఆకులు వేసి అవి సగం అయ్యే వరకు మరిగించి అందులో ఒక స్పూన్ తేనె వేసి వడగట్టి గోరువెచ్చగా భోజనం తర్వాత తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఉబ్బసం నుండి మంచి ఫలితం సత్వరం కనబడుతుంది.
◆జలుబు చేసినప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోయి ఊపిరి పీల్చడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు, గొంతు గరగర లాడుతూ నస గా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళల్లో కొన్ని పుదీనా ఆకులు వేసి ఆ నీళ్ళతో మనం ఆవిరి పడితే చాలా ఉపశమనం గా అనిపిస్తుంది.
◆పుదీనా లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఆహారంలో పుదీనాను భాగం చేసుకుంటే చిగుళ్లకు, పళ్లకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. తాజా పుదీనా ఆకులను నములుతూ ఉండటం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన దూరమవుతుంది.
◆శరీరంపై ఎక్కడైనా దురదలు పెడుతున్నా కాలిన గాయాలు ఉన్నా, పుదీనా ఆకులు నలిపి శరీరంపై దురదలు వచ్చిన దగ్గర ఆకుతో రుద్దితే క్షణాల్లో దురదలు తగ్గుతాయి.
◆పుదీనా ఆకును మొత్తగా పేస్ట్ లా చేసి అందులో కొంచెం పసుపు కలిపి, ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. మొటిమలు మటుమాయం అవుతాయి. వారానికి రెండు సార్లైనా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
◆పుదీనా ఆకులతో తయారు చేసిన నూనెను ఉపయోగిస్తే జుట్టు కుదుళ్ళు బలపడి జుట్టు ఊడకుండా తెల్లబడకుండా ఉంటుంది. పుదీనా నుంచి వచ్చే చక్కని సువాసన మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతుంది.
◆పుదీనా ఉపయోగించి తయారు చేసిన ఆహార పదార్థాలు కూడా మంచి రుచిని కలిగి ఉంటాయి.
పుదీనా మనం ఎక్కువగా ఉపయోగించడం వల్ల అందానికి అందం,ఆరోగ్యానికి ఆరోగ్యం, తక్కువ ఖర్చు లో మంచి ఫలితాలు అన్నమాట.
◆పుదీనాలో ఫైటో న్యూట్రియాన్స్ యాంటీ ఆక్సిడెంట్స్లు ఉండడం వల్ల జీర్ణశక్తికి బాగా ఉపయోగపడతాయి.
చివరగా…..
ఏ చిన్న సమస్య వచ్చినా ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెట్టడం చీటికీమాటికీ అవసరం ఉన్నా లేకపోయినా మందులు మింగడం సరైన పద్ధతి కాదు. మనకు అందుబాటులో ఉన్న పుదీనా మంచి ఆరోగ్య ప్రదాయిని కాదంటారా.