వేసవి వచ్చేసింది. బయట అడుగు పెడితే భగభగ మండే అగ్నిగోళంలా ఉంటుంది. చర్మం కందిపోవడం, నల్లబడటం, పొడిబారడం, జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు అయితే మరీ ఘోరం. వేసవిలో ఎదురయ్యే బోలెడు సమస్యలకు కొన్ని చిట్కాలు. వాటిని పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. హాట్ సమ్మర్ లో హెల్తి చర్మం మీ సొంతం.
◆ఎవరైనా మొదటగా ఇతరులను చూడగానే మొదట గమనించేది ముఖమే. ముఖం ఎంత తాజాగా, శుభ్రంగా ఉంటే అంత ఆకర్షణ. కానీ ముఖం మీద మచ్చలు, మొటిమలతో జిడ్డు పట్టి, ఇంకా వేసవి బాధకు చర్మం కందిపోయి ఎరుపెక్కి అది క్రమంగా నలుపుగా మారి మొహాన్ని వికారంగా మార్చేస్తుంది. ముఖాన్ని గంటకు ఒకసారి చల్లటి నీటితో కడుగుతూ ఉండాలి. రోజులో రెండు సార్లు రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి దాంతో ముఖమంత శుభ్రం చేసుకోవాలి. టమాటా, కీరా, గంధం వంటి వాటితో ముఖానికి తాజాగా ఫేస్ పాక్ వేసుకుని సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి దీనివల్ల వడలిన చర్మం తిరిగి సాధారణం అవుతుంది.
◆ చలికాలంలో ఉపయోగించి జిడ్డు గల క్రీములు వేసవికి వ్యతిరేకం. వేసవిలో చర్మానికి గాలి బాగా అవసరం అవుతుంది. చర్మరంద్రాలను ఆరోగ్యంగా ఉంచేలా తేలికపాటి క్రములు ఉపయోగించాలి. చర్మము చెమట వల్ల ఇబ్బంది తగ్గడానికి స్నానం చేసేటపుడు నీటిలో ఎస్సేంటియల్ ఆయిల్ రెండు చుక్కలు లేదా కాసింత రోజ్ వాటర్ వేసుకుని స్నానం చేయాలి. దీనివల్ల చర్మం తాజాగా ఆహ్లాదంగా ఉంటుంది.
◆ ఎండ ధాటికి భయపడి, ఫ్యాన్ లు, ఎయిర్ కూలర్ల ముందు పరిమితమైపోతే చర్మం పొడిబారిపోతుంది. కాబట్టి బయటి గాలి కూడా శరీరానికి తగులుతూ ఉండాలి. వేసవి బడలిక తగ్గడానికి ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు రెండు పూటలా స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి దీనివల్ల శరీరం చాలాబాగా విశ్రాంతి తీసుకుని నిద్ర పడుతుంది. ఎండలో ఎక్కువ తిరగకూడదు, తప్పనిసరి వెళ్లాల్సి వస్తే టోపి, లేదా స్పార్క్ వంటివి వాడాలి. గొడుగు వాడితే ఇంకా అత్యుత్తమం.
◆చలికాలం అయినా వేసవి కాలం అయినా ఆ ఉత్పత్తి మీద ఇచ్చిన ఎక్సపైర్ డేట్ ను గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ఎండకు ఇలాంటి సమయం గడిచిన ఉత్పత్తులు చాలా చేటు చేస్తాయి. చర్మ తత్వాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టు ఉత్పత్తులను వాడటం మంచిది.
◆ సాదారణంగా ఇంటి చిట్కాలు అద్భుతమైన పలితాన్ని ఇస్తాయి. టమాటా రసం, కీరా రసం, సేనగపిండి, పెరుగుల మిశ్రమం ముల్తానీ మట్టి వంటి స్వతహాగా చేసుకోగల చిట్కాలు ఉత్తమమైమవి.టమాటా రసాన్ని ఐస్ ట్రే లో వేసి ప్రతిరోజు ఒక ఐస్ ముక్కతో చర్మాన్ని రుద్దుతూ ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టమోటాలోని లైకోపీన్ ముఖ చర్మానికి అద్భుతాలు చేస్తుంది.
◆నిమ్మకాయ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసాన్ని కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
◆వేసవిలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం దాదాపు 3 గంటల వరకు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అవసరమైనప్పుడు, ఏవైనా పనులు చక్కబెట్టుకోవాల్సి వచ్చినపుడు ఉదయం 11 గంటల లోపు, మధ్యాహ్నం 3 గంటల తరువాత బయటకు వెళ్లడం ఉత్తమం. ముఖ్యంగా కళ్ళద్దాలు ఉపయోగించడం చాలా మంచిది. కళ్ల చుట్టూ చర్మం చాలా తొందరగా నలుపెక్కుతుంది, దీనికోసం శుభ్రమైన మరియు చల్లటి నీటితో కడగాలి. బంగాళాదుంప రసంలో ముంచిన రెండు చల్లని కాటన్ ప్యాడ్లు కళ్ళమీద వేయాలి.
◆రోజుకు రెండుసార్లు స్నానం చేయడం వల్ల మీ చర్మం తాజాగా ఉండటమే కాదు, వేసవి బద్ధకాన్ని ఎదుర్కోవటానికి కూడా ఇది సహాయపడుతుంది. వేప ఆకులలు వేసిన నీటితో స్నానం ఆరోగ్యకరంగా ఉంచుతుంది. శరీర దుర్వాసనతో బాధపడేవారు క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనం పొందవచ్చు. చిటికెడు ఉప్పు వేసిన నీటిలో చేతులు మరియు కాళ్ళను నానబెట్టడం రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది.
◆ చలువ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పల్లరసాలు, కొబ్బరినీళ్లు, పలుచటి మజ్జిగ, కుండలో నీళ్లు తీసుకోవాలి. కృత్రిమ జ్యుస్ లకు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. రోజు కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి. నూనె పదార్థాలు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి.
◆ధరించే దుస్తుల విషయంలో కాటన్ మరియు తేలికైన బట్టలు ఉక్కపోత నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. ప్రయాణం చేయవలసి వస్తే బైక్ లలో వెళ్లడం మానుకోవాలి.
చివరగా…..
అందరిని గడగలాడించే వేసవిని పైన చిట్కాలు పాటించడం ద్వారా సరదాగా గడిపేయచ్చు.